Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
Genesis 50
1. యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు.
2. తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు.
3. కాబట్టి వైద్యులు పూర్తి నలభై రోజులు తీసుకుని భద్రపరిచారు, ఎందుకంటే భద్రపరచడానికి అవసరమయ్యే సమయం అది. ఈజిప్టువారు అతని కోసం డెబ్బై రోజులు దుఃఖించారు.
4. సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో,
5. ‘నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకుని, “నేను చనిపోబోతున్నాను; కనాను దేశంలో నా కోసం నేను త్రవ్వించుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టండి” అని చెప్పాడు. కాబట్టి నాకు సెలవిస్తే నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వస్తాను’ అని చెప్పండి” అని అన్నాడు.
6. అప్పుడు ఫరో, “నీవు వెళ్లి, అతడు నీతో ప్రమాణం చేయించినట్టు నీ తండ్రిని పాతిపెట్టు” అన్నాడు.
7. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు,
8. యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు.
9. రథాలు, రథసారధులు కూడా అతనితో వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు.
10. వారు యొర్దాను దగ్గర ఉన్న ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర చేరినప్పుడు, వారు బిగ్గరగా, ఘోరంగా ఏడ్చారు; అక్కడ తన తండ్రి కోసం యోసేపు ఏడు రోజుల సంతాప కాలం పాటించాడు.
11. అక్కడ నివసించే కనానీయులు ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర ఏడ్వడం చూసి, “ఈజిప్టువారు శోకంతో సంతాప వేడుకను జరుపుకుంటున్నారు” అని అన్నారు. అందుకే యొర్దాను దగ్గర ఉన్న ఆ స్థలం ఆబేల్-మిస్రాయిము అని పిలువబడింది.
12. కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు:
13. అతన్ని కనాను దేశానికి మోసుకెళ్లి, అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలంలో ఉన్న గుహలో సమాధి చేశారు.
14. తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత యోసేపు తన సోదరులతో, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరితో ఈజిప్టుకు తిరిగి వెళ్లాడు.
15. తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, “ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?” అని అనుకున్నారు.
16. కాబట్టి వారు యోసేపుకు ఇలా కబురు పంపారు, “నీ తండ్రి చనిపోకముందు ఇలా ఈ సూచనలు ఇచ్చాడు:
17. ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.
18. అప్పుడు తన సోదరులు అతని దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, “మేము నీ బానిసలం” అన్నారు.
19. అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా?
20. మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు.
21. కాబట్టి ఇప్పుడు భయపడకండి. నేను మీకు, మీ పిల్లలకు సమకూరుస్తాను” అని అన్నాడు. అతడు వారికి మళ్ళీ అభయమిచ్చి దయతో మాట్లాడాడు.
22. యోసేపు తన తండ్రి కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసించాడు. అతడు నూటపది సంవత్సరాలు జీవించాడు,
23. ఎఫ్రాయిం పిల్లల మూడవ తరాన్ని చూశాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన పిల్లలు కూడా యోసేపు సొంతవారిగా పెరిగారు.
24. యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు.
25. యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు.
26. యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.