Read Bible

Free to use • No login or registration required • For all ages

Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.

Genesis 5

1. ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.

2. ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.

3. ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు.

4. షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

5. ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

6. షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు.

7. ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

8. షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

9. ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు.

10. కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

11. ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

12. కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.

13. మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

14. కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

15. మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు.

16. యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

17. మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

18. యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు.

19. హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

20. యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

21. హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.

22. మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

23. హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు.

24. హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.

25. మెతూషెల 187 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి లెమెకు పుట్టాడు.

26. లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

27. మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

28. లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు.

29. అతనికి నోవహు అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు.

30. నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

31. లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

32. నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.