Read Bible
Free to use • No login or registration required • For all ages
Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.
1. యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు, ఏశావు తన నాలుగువందలమంది మనుష్యులతో వస్తూ కనిపించాడు; కాబట్టి అతడు పిల్లలను లేయాకు రాహేలుకు ఇద్దరు దాసీలకు పంచి అప్పగించాడు.
2. అతడు దాసీలు, వారి పిల్లలను ముందు ఉంచి, తర్వాత లేయా తన పిల్లలను, చివరిగా రాహేలును, యోసేపును ఉంచాడు.
3. అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు.
4. అయితే ఏశావు యాకోబును కలవడానికి పరుగెత్తి వెళ్లి అతన్ని హత్తుకున్నాడు; తన చేతులు అతని మెడ మీద వేసి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఏడ్చారు.
5. ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.
6. అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు వచ్చి అతనికి నమస్కారం చేశారు.
7. తర్వాత లేయా, ఆమె పిల్లలు వచ్చి నమస్కరించారు. చివరికి యోసేపు, రాహేలు కూడా వచ్చి నమస్కరించారు.
8. ఏశావు, “ఈ మందలు, పశువులన్నీ నాకు ఎందుకు?” అని అడిగాడు. “నా ప్రభువా, నీ దృష్టిలో దయ పొందడానికి” అని యాకోబు అన్నాడు.
9. అయితే ఏశావు, “నా తమ్ముడా, నాకిప్పటికే సమృద్ధిగా ఉంది. నీది నీవే ఉంచుకో” అని అన్నాడు.
10. యాకోబు ఇలా అన్నాడు, “దయచేసి, వద్దు! నీ దృష్టిలో నేను దయ పొందితే, ఈ బహుమానం అంగీకరించాలి. నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టే ఉంది, దయతో నీవు నన్ను చేర్చుకున్నావు.
11. దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు.
12. అప్పుడు ఏశావు, “మనం వెళ్తూ ఉందాము; నేను మీతో వస్తాను” అని అన్నాడు.
13. కానీ యాకోబు అతనితో, “నా దగ్గర ఉన్నవి పసిపిల్లలు, గొర్రెలు, మేకలు వాటికి పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వీటిని త్వరపెట్టి తోలితే, పశువులన్నీ చస్తాయి.
14. కాబట్టి నా ప్రభువు తన సేవకునికి ముందుగా వెళ్లాలి. నేను శేయీరులో ఉన్న నా ప్రభువు దగ్గరకు వచ్చేవరకు, నా ముందున్న గొర్రెల మందలు పశువుల మందలు, అలాగే ఈ పసిపిల్లలు నడువగలిగిన దానిని బట్టి వాటిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువస్తాను” అని అన్నాడు.
15. అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు. “అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు.
16. కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు.
17. అయితే యాకోబు మాత్రం సుక్కోతుకు వెళ్లాడు, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టించుకుని, పశువులకు పాకలు వేశాడు. అందుకే ఆ స్థలం సుక్కోతు అని పిలువబడింది.
18. యాకోబు పద్దనరాము నుండి వచ్చి, క్షేమంగా కనానులో ఉన్న షెకెము పట్టణానికి చేరాడు, ఆ పట్టణం ఎదురుగా గుడారం వేసుకున్నాడు.
19. తాను గుడారం వేసుకున్న స్థలాన్ని షెకెము తండ్రియైన హమోరు కుమారుల దగ్గర వంద వెండి నాణేలకు కొన్నాడు.
20. అక్కడ అతడు బలిపీఠం కట్టాడు, ఆ స్థలానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.