Read Bible

Free to use • No login or registration required • For all ages

Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.

Genesis 21

1. యెహోవా తాను చెప్పినట్టే శారా పట్ల కృప చూపించారు, శారాకు వాగ్దానం చేసినట్టే యెహోవా చేశారు.

2. సరిగ్గా దేవుడు వాగ్దానం చేసిన నిర్ణీత కాలంలో శారా గర్భవతియై, వృద్ధాప్యంలో ఉన్న అబ్రాహాముకు కుమారున్ని కన్నది.

3. అబ్రాహాము, శారా తన కోసం కన్న కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.

4. దేవుని ఆజ్ఞమేరకు తన కుమారుడైన ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రాహాము సున్నతి చేశాడు.

5. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరు సంవత్సరాల వృద్ధుడు.

6. శారా, “నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు,

7. శారా పిల్లలకు పాలిస్తుందని అబ్రాహాముతో ఎవరు అంటారు? అయినా నా భర్తకు వృద్ధాప్యంలో కుమారున్ని కన్నాను” అని అన్నది.

8. ఇస్సాకు పాలు విడిచిన రోజు అబ్రాహాము పెద్ద విందు చేశాడు.

9. అయితే ఈజిప్టు దాసి హాగరు ద్వార అబ్రాహాముకు పుట్టిన కుమారుడు శారాను హేళన చేయడం చూసి,

10. ఆమె అబ్రాహాముతో, “ఆ దాసిని దాని కుమారున్ని పంపివేయండి, దాని కుమారుడు ఎప్పటికీ నా కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని శారా చెప్పింది.

11. తన కుమారునికి సంబంధించిన విషయం కాబట్టి అబ్రాహాము చాలా బాధపడ్డాడు.

12. అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది.

13. అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.”

14. మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.

15. తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ పిల్లవాన్ని ఒక పొద క్రింద ఉంచింది.

16. తర్వాత ఆమె కొంత దూరం వెళ్లి కూర్చుంది, ఎందుకంటే, “బాలుడు చావడం నేను చూడలేను” అని అనుకుంది. అక్కడ కూర్చుని అదుపు లేకుండ ఏడవసాగింది.

17. దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు.

18. ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు.

19. అప్పుడు దేవుడు ఆమె కళ్లు తెరిచారు, ఆమె నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి త్రాగడానికి ఇచ్చింది.

20. ఆ పిల్లవాడు ఎదుగుతుండగా దేవుడు అతనితో ఉన్నారు. అతడు ఎడారిలో నివసిస్తూ విలుకాడయ్యాడు.

21. అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది.

22. ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు.

23. కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.”

24. అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు.

25. అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు.

26. అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు.

27. అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు.

28. అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు.

29. అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు.

30. అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు.

31. అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ అని పేరు పెట్టారు.

32. బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు.

33. అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు.

34. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.