Read Bible

Free to use • No login or registration required • For all ages

Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.

Genesis 17

1. అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.

2. అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు.

3. అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు,

4. “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు.

5. ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను.

6. నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు.

7. నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.

8. నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”

9. అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి.

10. నీకు నీ తర్వాత నీ సంతతివారికి నేను చేసే నా నిబంధన, మీరు నిలుపుకోవలసిన నిబంధన ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలి.

11. మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా మీ గోప్య చర్మాన్ని సున్నతి చేసుకోవాలి.

12. రాబోయే తరాలలో ఎనిమిది రోజుల వయస్సున్న ప్రతి మగబిడ్డకు అంటే మీ ఇంట్లో పుట్టినవారైనా మీ సంతతి కాక విదేశీయుల నుండి కొనబడినవారైనా సున్నతి చేయబడాలి.

13. మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి.

14. సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.”

15. దేవుడు అబ్రాహాముతో ఇలా కూడా చెప్పారు, “నీ భార్యయైన శారాయిని ఇకపై శారాయి అని పిలువకూడదు; ఇప్పటినుండి తన పేరు శారా.

16. నేను ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె ద్వార నీకు కుమారున్ని ఇస్తాను. ఆమె జనాంగాలకు తల్లిగా ఉండేలా తనను ఆశీర్వదిస్తాను; అనేక జనాంగాల రాజులు ఆమె నుండి వస్తారు.”

17. అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడ్డాడు; అతడు తన హృదయంలో నవ్వుకుంటూ, “నూరు సంవత్సరాలు నిండిన మనుష్యునికి కుమారుడు పుడతాడా? తొంభై సంవత్సరాలు నిండిన శారా బిడ్డను కంటుందా?” అని అనుకున్నాడు.

18. అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.

19. అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను.

20. ఇష్మాయేలు గురించి, నీవు అడిగింది విన్నాను: నేను అతన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను; అతడు ఫలించి విస్తరించేలా చేస్తాను, సంఖ్యాపరంగా గొప్పగా విస్తరింపజేస్తాను. అతడు పన్నెండుమంది పాలకులకు తండ్రిగా ఉంటాడు; అతన్ని గొప్ప జనంగా చేస్తాను.

21. అయితే వచ్చే యేడాది ఈ సమయానికి శారా నీకోసం కనే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను” అని చెప్పారు.

22. దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత, పైకి వెళ్లిపోయారు.

23. ఆ రోజే అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, ఇంట్లో పుట్టిన లేదా డబ్బుతో కొనబడిన మగవారికందరికి దేవుడు చెప్పినట్టు సున్నతి చేయించాడు.

24. అబ్రాహాము సున్నతి పొందినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు,

25. తన కుమారుడైన ఇష్మాయేలు వయస్సు పదమూడు సంవత్సరాలు;

26. అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలు, ఇద్దరు అదే రోజు సున్నతి పొందారు.

27. అబ్రాహాము ఇంటివారిలో మగవారందరు, అతని ఇంట్లో పుట్టిన వారు లేదా విదేశీయుల నుండి కొనబడిన అతనితో పాటు సున్నతి చేయించుకున్నారు.