Read Bible

Free to use • No login or registration required • For all ages

Choose your language, version, book, and chapter below. You can optionally pick a single verse for a focused view. Then click Go to see the passage. Need help? See our How to use guide.

1 Samuel 27

1. తరువాత దావీదు “నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు” అని మనసులో అనుకుని

2. లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు.

3. దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.

4. దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు.

5. దావీదు “రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు” అని ఆకీషును అడిగితే,

6. ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకూ సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.

7. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.

8. తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.

9. దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు.

10. అప్పుడు ఆకీషు “ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?” అని దావీదును అడిగితే, దావీదు “యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము” అన్నాడు.

11. ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు.

12. ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు” అనుకున్నాడు.